- తప్పుడు వార్తలు నమ్మొద్దని రైతులకు సూచన
హైదరాబాద్, వెలుగు: వరి విత్తనాల కొనుగోలు లేదా సాగు కోసం ప్రభుత్వం ఎలాంటి సెల్ఫ్ డిక్లరేషన్ అడగడం లేదని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి స్పష్టం చేశారు. దీనిపై కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్ నినో పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గడం, రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని మాత్రమే చెబుతున్నామని, ‘వరి సాగు చేసి నష్టపోతే ప్రభుత్వానికి బాధ్యత లేదు.. మాదే బాధ్యత’ అంటూ ఎలాంటి సెల్ఫ్ డిక్లరేషన్ అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి తప్పుడు డిక్లరేషన్ ఫారాలను సృష్టించి కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులు, బోర్ల కింద సాగునీటి వసతి ఉన్న భూముల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
